శంకర్ కూడా డబ్బులు ఇచ్చారు
on Feb 29, 2020
'ఇండియన్ 2' చిత్రీకరణలో చోటు చేసుకున్న ప్రమాదం కారణంగా మృతి చెందిన సహాయ దర్శకుడు, మరో ఇద్దరికి కలిపి హీరో కమల్ హాసన్ కోటి రూపాయల సాయం అందించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఆయన డబ్బులు ఇస్తున్నట్టు తెలిపారు. హీరోతో పాటు 'ఇండియన్ 2' నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. చిత్రదర్శకుడు శంకర్ కాస్త లేటుగా మృతులకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. తానూ కోటి రూపాయలు ఇస్తున్నట్టు శుక్రవారం తెలిపారు. నిజానికి, ప్రమాదం జరిగిన తర్వాత కోలుకోవడానికి శంకర్ కి చాలా టైమ్ పట్టింది. ఆ బాధలోంచి ఇంకా బయటకు రాలేదనేది ఆయన మాటల్లో వ్యక్తం అవుతోంది. రెండు మూడు రోజుల క్రితం 'ప్రమాదంలో ఆ క్రేన్ నా మీద పడినా బావుండేది' అని శంకర్ ట్వీట్ చేశారు. శుక్రవారం మృతులకు కోటి సాయాన్ని ఇస్తున్నట్టు చేసిన ప్రకటనలో ప్రమాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నారు. మరోవైపు కమల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య లేఖల యుద్ధం సాగింది. ప్రమాదం జరిగిన తర్వాత నిర్మాణ సంస్థ సరిగా స్పందించలేదని కమల్ లేఖ రాయగా... అందుకు లైకా ఘాటుగా బదులిచ్చింది.